Promotions to 5419 Teachers in AP - 4421 SGTs - 998 SA Posts Upgradation

5,419 మంది టీచర్లకు పదోన్నతి!
4,421 ఎస్జీటీ... 998 ఎస్‌ఏ పోస్టుల అప్‌గ్రెడేషన్‌
2,342 పోస్టుల కన్వర్షన్‌.. హైస్కూళ్లుగా 52 ప్రీహైస్కూళ్లు
పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు

Promotions to 5419 Teachers in AP - 4421 SGTs - 998 SA Posts Upgradation 

రాష్ట్రవ్యాప్తంగా 5,419 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. అందుకోసం ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త పోస్టులు సృష్టించకుండా ప్రస్తుత పోస్టులను ఉన్నతీకరించడం ద్వారా ఈ పదోన్నతులు లభించనున్నాయి. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ఇటీవల చేపట్టిన విలీనం, హేతుబద్ధీకరణ ప్రక్రియకు అనుగుణంగా ఈ మేరకు పోస్టులను ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేస్తోంది. మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధన చేయించాలనే ప్రణాళిక అమలుకు ఈ చర్యలు చేపట్టింది. తరగతుల విలీనంతో మొత్తంగా వేల సంఖ్యలో టీచర్లు మిగిలిపోతున్న పరిస్థితి ఓవైపు కనిపిస్తుంటే, మరోవైపు పదోన్నతుల కల్పనకు ఈ అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ చేపట్టారు.

దీంతోపాటు సబ్జెక్టు మార్చుకోవాలనుకునేవారి కోసం 2,342 పోస్టుల కన్వర్షన్‌కు అనుమతిచ్చారు. దీంతో ఖాళీల ఆధారంగా ప్రస్తుతం ఒక సబ్జెక్టును బోధిస్తున్న టీచర్‌ మరో సబ్జెక్టు టీచర్‌గా మారవచ్చు. అయితే, ఆ సబ్జెక్టు బోధనకు వారికి అర్హత ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 4,421 ఎస్జీటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా, 998 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటితోపాటు 52 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు తెలిపింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా తీసుకుంటే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 925 పోస్టులు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒక్క పోస్టు కూడా అప్‌గ్రేడ్‌ జాబితాలో లేదు.